దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్లోని బైసరన్ పచ్చికభూముల్లో పర్యాటకులపై జరిగిన దారుణమైన దాడికి పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించడం ఆందోళన కలిగించే విషయం. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దాడిలో 27 మంది పర్యాటకులు మరణించగా, చాలా మంది గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటక కార్యకలాపాలు సాధారణంగా పెరిగే కాలం అయిన అమర్నాథ్ యాత్రకు కొన్ని వారాల ముందు ఈ దాడి ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఏమిటీ TRF
ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తోయిబా షాడో గ్రూపే ది రిసెస్టెన్స్ ఫ్రంట్ (TRF). ఇది కొత్తదే అయినప్పటికీ ప్రాణాంతకమైన ఉగ్రవాద సంస్థగా ముద్రపడింది. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తీసేస్తూ చేపట్టిన చర్యకు వ్యతిరేకంగా ఈ ఉగ్రసంస్థను ఏర్పాటు చేశారు. తొలుత ఆన్ లైన్ లో కార్యకలాపాలు నిర్వహించినా.. ఆ తర్వాత అది లష్కరే తోయిబా లాంటి పలు ఉగ్రసంస్థల సభ్యులను తీసుకొని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది.దీని వెనుక పాకిస్థాన్ ఉంది. దాయాదికి చెందిన గూఢాచార సంస్థ ఐఎస్ఐనే టీఆర్ఎఫ్ ను క్రియేట్ చేసినట్లుగా చెబుతారు.
నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం చూపును మళ్లించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేయించినట్లుగా చెబుతారు. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల నేపథ్యంలో 2018లో ఆ సంస్థ నిషేధిత దేశాల జాబితాలో పాకిస్థాన్‌ను ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ చేర్చింది. దీంతో పాక్ దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. ఈ క్రమంలోనే టీఆర్ఎఫ్ ఏర్పాటు చేశారని చెబుతారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఏడాదిలోనే ఈ సంస్థను ఏర్పాటు చేయడం గమనార్హం.
ఈ ఉగ్ర సంస్థను ఏర్పాటు చేసింది షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్. ఇతడో కశ్మీరీ మిలిటెంట్. ఈ సంస్థ తొలిసారి శ్రీనగర్‌లోని ప్రముఖ జర్నలిస్టు అయిన షుజాత్ బుఖారీ..అతడి భద్రతా సిబ్బంది ఇద్దరిని హతమార్చటానికి కుట్ర పన్నాడు. ఉగ్ర కార్యక్రమాలతో ఉపా చట్టం కింద సజ్జాద్‌ను ఉగ్రవాదిగా కేంద్రం ప్రకటించింది. ఇతడు గతంలో లష్కరే తోయిబా కమాండర్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఇతడితో పాటు.. లష్కరేలో పని చేసిన పలువురు ఇందులో చేరారు. ఈ సంస్థ టార్గెట్ మొత్తం మతాల వారీగానే ఉంటుంది. కొన్ని మతాల్ని లక్ష్యంగా చేసుకున్న ఈ సంస్థ దాడి చేసి హతమార్చిన వారిలో ఎక్కువగా కశ్మీరీ పండిట్లు, హిందువులు, సిక్కులు ఉన్నారు. ముస్లింలు సైతం ఉన్నారు.
2019లో కార్యకలాపాలను ప్రారంభించిన టీఆర్ఎఫ్ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కాశ్మీర్ యువతను ఆకర్షించడం, వారికి భారత్ పట్ల వ్యతిరేక భావన కలిగించి తమ ఉగ్రవాద సంస్థలో చేర్చుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. 2020 ఏప్రిల్ ఒకటో తేదీన నియంత్రణ రేఖ వెంట.. కుప్వారాలోని కేరన్ సెక్టార్లో నాలుగు రోజులు ఎదురుకాల్పులు జరిగినప్పుడు తొలిసారిగా టీఆర్ఎఫ్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే పలు దాడులకు పాల్పడి.. పలువురు ప్రాణాలు తీశారు. చివరగా వీరి ఉగ్ర కార్యకలాపాల్ని చూస్తే.. 2024 అక్టోబరు 20న గండేర్బల్లోని సోన్మార్గ్లో ఒక డాక్టర్.. ఆరుగురు వలస కార్మికులను హతమార్చింది.
టీఆర్ఎఫ్తో సంబంధం ఉన్న ప్రముఖ ఉగ్రవాదుల్లో సాజిద్ జాట్, సజ్జాద్ గుల్ మరియు సలీం రెహ్మానీ ఉన్నారు. వీరందరికీ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నాయి. 2023లో టీఆర్ఎఫ్ సంస్థపై భారత ప్రభుత్వం బ్యాన్ విధించగా, ఇప్పటివరకు ఆరుసార్లు దాడులకు తెగబడ్డ ఈ సంస్థ అంతు చూడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి.