బెంగాల్ లో హిందువులే లక్ష్యంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముర్షీదాబాద్ తో సహా తదితర ప్రాంతాల్లో నిరసన కాస్తా... హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇవి హిందువులే టార్గెట్ గా జరుగుతున్నాయని, దాదాపు 400 మందికి పైగా హిందువులు ఇళ్ల నుంచి బయటకు పంపినట్లు బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేర్కొంటున్నారు. అలాగే హిందువులు మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఇదంతా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలతోనే వచ్చిందని మండిపడ్డారు. ఈ బుజ్జగింపు రాజకీయాలను అడ్డంపెట్టుకొనే మూకలు చెలరేగిపోతున్నాయన్నారు. మతోన్మాదులకు భయపడి ముర్షిదాబాద్ లోని ధులియన్ అనే ప్రాంతం నుంచి 400 మందికి పైగా హిందువులు పడవలో గంగానది మీదుగా వెళ్లిపోయారని, డియోనాపూర్, బైస్నాబ్ నగర్, మాల్డాలో ఆశ్రయం పొందుతున్నారన్నారు.
ఈ సందర్భంగా సుబేందు అధికారి తన సోషల్ మీడియాలో బాధితులకి సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేశారు. ‘‘నా ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కూడా సహాయం ఏమీ చేయలేదు. సింపుల్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు.’’ అంటూ ఓ హిందువు వాపోయిన వీడియోను పోస్ట్ చేశారు.
హిందువులు తిరిగి తమ తమ ఇళ్లకు సురక్షితంగా తిరిగి వచ్చేలా పోలీసులు బాధ్యత తీసుకోవాలని, భద్రతా దళాలు కూడా దీనిపై దృష్టి సారించాలని సుబేందు కోరారు. అలాగే జిహాదీ భావాలున్న వారి నుంచి వారిని కాపాడాలన్నారు. బెంగాల్ మండిపోతోందని సుబేందు అధికారి అన్నారు.
ఇక... ఇదే అంశంపై బీజేపీ సీనియర్ నేత అర్జున్ సింగ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ హింస నేపథ్యంలో హిందూ సమాజం వలసెళ్లిపోతోందన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా షేర్ చేశారు. వందలాది మంది హిందువులు ధూలియన్ నుంచి పడవలో గంగా నది మీదుగా మాల్డా జిల్లాలోని కాలియాచక్ తదితర ప్రాంతాల్లో వెళ్లిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి హిందువులు అక్కడికి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపుగా 40 నుంచి 50 పడవల్లో ధులియాన్ నుంచి దాదాపు 1000 మంది వరకూ హిందువులు వలసవెళ్లిపోయారని, తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ‘‘ముస్లిం మూకలు ప్రతిదీ తగలబెడుతున్నారు. కేవలం హిందువుల ఇళ్లకే నిప్పు పెడుతున్నారు. ముస్లింల ఇళ్లు క్షేమంగానే వున్నాయి.’’ అని ఓ హిందూ మహిళ పేర్కొంది.
‘‘ముర్షిదాబాద్ లో బాంబులు విసిరారు. దీంతో నేను ఇంటి నుంచి పారిపోయాను. కేంద్రంలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. అందుకే ఇక్కడ హిందువులు నివసించడానికి మేము అనుమతించం అని బెదిరింపులకు దిగారు. మా ఇళ్లను ధ్వంసం చేశారు. మా బంగారు ఆభరణాలు దోచుకున్నారు. వస్తువులను లాక్కొన్నారు. మా ఇళ్లకు నిప్పంటించారు’’ అని ప్రకటించింది.