కొత్త వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్టు కేంద్ర అత్యున్నత నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో బెంగాల్లో దాడులు చేసిన చరిత్ర జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్‌కు(జేఎమ్బీ) ఉంది. ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్‌పై పట్టు బిగిస్తున్నదని, ఏడు సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నదని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముఖ్యంగా ఆ జిల్లాల్లోని మదర్సాల నుంచి యువకులను భారీగా జేఎమ్బీ నియమించుకుంటోందని చెబుతున్నాయి. ముర్షిదాబాద్, 24 పరగణాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనుక ఉన్నది ఈ సంస్థయేనని అంటున్నాయి. దీనివల్ల బెంగాల్ తీవ్రమైన శాంతిభద్రతల సమస్యను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇస్లామిక్ ఎజెండా కింద తాజాగా వక్ఫ్ ఆందోళనలను రగుల్చుతున్నదనే భయాందోళనలను నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో బిఎస్ఎఫ్ కు చెందిన 8కంపెనీల జవాన్లు, వెయ్యిమంది పోలీసులను మోహరించారు. ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు. డీజీ స్థాయి నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు.. కీలక పోలీసు అధికారులు పరిస్థితులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలాఉండగా, అల్లర్ల తర్వాత దాదాపు 400 మంది హిందువులు ముర్షిదాబాద్, ధూలియన్ తదితర ప్రాంతాలను వదిలిపెట్టి భగీరథి నదిని దాటి పొరుగు జిల్లా మాల్దాకు పారిపోయినట్టు బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి తెలిపారు. సీఎం మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల కోసం కావాలనే బెంగాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం విస్తరించడానికి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలను సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం కింద కల్లోలిత ఏరియాలుగా ప్రకటించాలంటూ కేంద్రానికి బీజేపీ ఎంపీ జ్యోతిర్మయి సింగ్ లేఖ రాశారు.