తమిళనాడులోని కట్టుకొల్లై గ్రామంలోని 150 కుటుంబాల భూమి తమదేనంటూ వక్ఫ్ బోర్డు ప్రకటించేసుకుంది. అంతేకాకుండా ఆ కుటుంబాలకు వక్ఫ్ బోర్డు నోటీసులు కూడా పంపింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విరించిపురంలోని సయ్యద్ అలీ మసీదు జారీ చేసిన ఈ నోటీసుల్లో... 150 కుటుంబాలకు సంబంధించిన భూమి తమదేనని పేర్కొంది. అయితే.. ఈ నోటీసులు జారీ చేయడంపై వక్ఫ్ బోర్డుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు వక్ఫ్ బోర్డు నోటీసులపై హిందూ మున్నాని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులకు అండగా వుంటామని కూడా ప్రకటించింది. కట్టుకొల్లైలో నాలుగు తరాలుగా నివసిస్తున్నారని, ఈ భూమిపై పన్నులు కూడా వారు కడుతున్నారని హిందూ మున్నాని కార్యకర్తలు పేర్కొన్నారు. అయితే.. వక్ఫ్ నోటీసులు జారీ చేసిన తర్వాత బాధితులతో కలిసి తాము జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశామని కార్యకర్తలు పేర్కొన్నారు. అయితే.. ఆ భూమి ప్రభుత్వానిదని, వక్ఫ్ ఆస్తి ఎంత మాత్రమూ కాదని కలెక్టర్ పేర్కొన్నారని హిందూ మున్నాని కార్యకర్తలు పేర్కొన్నారు.
ఇదే విషయంపై హిందూ మున్నాని కార్యకర్త మహేష్ మాట్లాడుతూ.. ఇటీవలే శాసనసభ చేసిన మార్పులను ఉటంకించారు. వక్ఫ్ బిల్లు ఇటీవలే ఆమోదం పొందిందని, వున్నఫళంగా భూమి విషయంలో వక్ఫ్ బోర్డు పన్నులు అడుగుతోందని, వెల్లూరులోని చాలా మంది గ్రామస్థులు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
మరోవైపు వక్ఫ్ బోర్డు నోటీసులందుకున్న వారు స్పందించారు. తాము ఈ భూమిపై వుండే అన్ని పన్నులూ చెల్లిస్తున్నామని, ఇంతలోనే ఆ భూమి తమదంటూ వక్ఫ్ బోర్డు నోటీసులు పంపిందన్నారు. దాదాపు 200 కుటుంబాలకు ఈ నోటీసులు అందాయని పేర్కొన్నారు.
ఇక.. కిలిందల్ మసీదు, హజ్రత్ సయ్యద్ అలీ సుల్తానా అలీ దర్గా ముతావలీ సయ్యద్ సతమ్ కూడా స్పందించారు. గ్రామస్థులకు నోటీసులిచ్చామని, వాటికి సంబంధించిన అన్ని రికార్డులూ తమ వద్ద వున్నాయని ప్రకటించారు.1954 నుంచే ఆ ఆస్తి తమదని రికార్డుల్లో వుందని, అది వక్ఫ్ ఆస్తి అని రికార్డులు చూపిస్తున్నాయన్నారు. ఆ భూమి మసీదుకి చెందిందని గ్రామస్థులకు కూడా తెలుసని, వారితో కూడా మాట్లాడామన్నారు. వారు తమకు అద్దె చెల్లించాల్సిందేనన్నారు. వీటికి సంబంధించిన అన్ని రికార్డులను, ఆధారాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని కూడా ముతావలీ ప్రకటించారు. దీంతో వివాదం మరింత రాజుకుంది.